తెలంగాణలో ఐపీఎస్ ఐఏఎస్ ల బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇటీవలే పరిమిత సంఖ్యలో ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం.. తాజాగా భారీస్థాయిలో మార్పులు చేసింది. సుదీర్ఘకాలం ఒకే స్థానంలో కొనసాగుతున్న పలువురు సీనియర్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్‌ ఎస్పీల నుంచి అదనపు డీజీపీల వరకు 29 మందికి స్థానచలనం కలిగింది. హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో అదనపు డీజీగా.. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావుకు పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ ఏడీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్‌ డీఐజీగా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె నల్గొండ ఎస్పీగానూ కొనసాగనున్నారు. రామగుండం కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డిని బదిలీ చేయగా.. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. చాలాకాలంగా పనిచేస్తున్న జిల్లా ఎస్పీలను మాత్రం ఇంకా మార్చలేదు. వీరికి సంబంధించి త్వరలో మరో జాబితా వెలువడే అవకాశముంది.

*9 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు సందీప్‌ సుల్తానియా, అనితా రాజేంద్రలకు ముఖ్యకార్యదర్శి హోదాలు*

హైదరాబాద్‌: రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ అధికారులు పదోన్నతులు పొందారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సంయుక్త డైరెక్టర్‌ జనరల్‌ అనితా రాజేంద్రలకు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుల్తానియా ముఖ్యకార్యదర్శి హోదాలో అదే శాఖలో విధులు నిర్వర్తించాలని, అనితా రాజేంద్ర ఎంసీహెచ్‌ఆర్డీలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌ హోదాతో కొనసాగాలని ఆదేశించింది. మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, సందీప్‌కుమార్‌ ఝా, సిక్తా పట్నాయక్‌, ముషారఫ్‌ అలీ ఫరూఖీ, కృష్ణ ఆదిత్య, వీపీ గౌతం, కె.స్వర్ణలతలకు సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల్లోనే వీరు కొనసాగాలని సూచించింది. త్వరలో మరికొందరికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.