నేటినుంచి నుమాయిష్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నేడు ‘నుమాయిష్‌’ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి 15 వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయా వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. కాగా, ఎగ్జిబిషన్‌ను మంత్రి హరీశ్‌ రావు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.
*ఈ రూట్లలో ఆంక్షలు..*
ఎస్‌ఏ బజార్‌, జాంబాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే డిస్ట్రిక్ట్‌ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఇతర భారీ వాహనాలను మొజాంజాహి మార్కెట్‌ వద్ద దారి మళ్లించి అబిడ్స్‌ మీదుగా అనుమతిస్తారు.

బషీర్‌బాగ్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే డిస్ట్రిక్ట్‌ ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఇతర భారీ వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద దారి మళ్లించి బీజేఆర్‌ స్టాచ్యు, అబిడ్స్‌ మీదుగా అనుమతిస్తారు.
బేగంబజార్‌ ఛత్రి నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ, చిన్నపాటి గూడ్స్‌ వాహనాలను అలస్కా జంక్షన్‌ వద్ద దారి మళ్లించి దారుసలాం, ఏక్‌మీనార్‌ మీదుగా నాంపల్లి వైపునకు అనుమతిస్తారు.
దారుసలాం, గోషామహల్‌ రోడ్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లే భారీ, చిన్నపాటి గూడ్స్‌ వాహనాలను అలస్కా జంక్షన్‌ వద్ద దారి మళ్లించి బేగంబజార్‌, సిటీ కాలేజ్‌, నయాపూల్‌ మీదుగా అనుమతిస్తారు.
బహుదూర్‌పురా, మూసాబౌలి నుంచి నాంపల్లి వైపు వెళ్లే భారీ, చిన్నపాటి గూడ్స్‌ వాహనాలు, ఆర్టీసీ బస్సులను సిటీకాలేజీ వద్ద దారి మళ్లించి, నయాపూల్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా అనుమతిస్తారు.
*స్పెషల్‌ ఆర్టీసీ బస్సులు..*
ఎగ్జిబిషన్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. తాజాగా నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే ప్రదర్శనకు వచ్చే వారి కోసం 25 డిపోల నుంచి బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 12 వరకు 111 బస్సులు, ఆ తర్వాత జనవరి 13 నుంచి ఎగ్జిబిషన్‌ ముగిసే వరకు పని దినాల్లో 164 బస్సులు, సెలవు రోజుల్లో 218 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.