కొత్త ఏడాదిలో ఎన్నికల ‘ఢీ

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఊహించని మలుపులతో గతేడాది ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తులు, విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారం మోత మోగించాయి. 2022లో మొత్తంగా ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగ్గా.. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ సర్కార్‌ కూలిపోవడం, బిహార్‌లో భాజపాకు నీతీశ్‌ కటిఫ్‌ వంటి అనూహ్య రాజకీయ పరిణామాలు యావత్‌ దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలకు సైరన్‌ మోగించేలా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొననుంది. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌లా భావించే ఈ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే జోరుగా పావులు కదుపుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల జాబితా ఇదే..

త్రిపుర(60) – ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది (మార్చి 22తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

మేఘాలయా(60)- ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది (మార్చి 15తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

నాగాలాండ్‌(60)- ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది (మార్చి 12తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

కర్ణాటక (224)- మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం (మే 24 నాటికి అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

ఛత్తీస్‌గఢ్‌(90) – నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 3తో అసెంబ్లీ గడువు ముగియనుంది)

మధ్యప్రదేశ్‌(230) – నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 6తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

మిజోరం(40)- నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2023 డిసెంబర్‌ 17తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

రాజస్థాన్‌(200)-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 14తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

తెలంగాణ(119)-నవంబర్‌- డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం (2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది)

జమ్మూకశ్మీర్‌- ఈ ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది!

పైరాష్ట్రాల్లో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధికంగా ఉన్నాయి. త్రిపురలో ఐపీఎఫ్‌టీతో పొత్తులో ఉన్న కాషాయ పార్టీ.. మేఘాలయా, నాగాలాండ్‌లలో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలో కొనసాగుతోంది. వీటితో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోనూ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో భాజపాకు ఈసారి కాంగ్రెస్‌, స్థానిక పార్టీలు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. రెండోసారి అక్కడ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే, తెలంగాణలో కేసీఆర్‌ సారథ్యంలోని భారాస అధికారంలో కొనసాగుతుండగా.. ఈసారి ఇక్కడ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌, భాజపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.