ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం

దిల్లీ: ఆధార్‌ కార్డులో అడ్రస్‌ అప్‌డేట్‌ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరు తమ పేరు మీద ఉన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒకవేళ అడ్రస్ ధ్రువీకరణ లేకుంటే అడ్రస్‌ అప్‌డేట్‌ చేయడం సాధ్యంకాదు. ఇకపై ఈ ప్రక్రియ సులభతరం కానుంది. ఆధార్‌లో అడ్రస్‌ మార్చుకునేందుకు దరఖాస్తుదారు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న రేషన్‌కార్డ్‌, వివాహ ధ్రువీకరణపత్రం, పాస్‌పోర్ట్ వంటివి కూడా సమర్పించవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారు అడ్రస్‌ అప్‌డేట్‌ కోసం సమర్పించిన ధ్రువీకరణ పత్రం సరైంది కాకుంటే, ఉడాయ్‌ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద స్వీయధ్రువీకరణ (Self-declaration) సమర్పించాలి. దాన్ని పరిగణలోకి తీసుకుని దరఖాస్తుదారు ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్ చేయబడుతుంది.

‘‘ ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాలతో చాలా మంది తరచుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అవుతుంటారు. అలాంటి వారికి తమ పేరుతో అడ్రస్‌ ధ్రువీకరణ పత్రాలు దొరకడం సులువేంకాదు. ఒకవేళ తప్పనిసరిగా ఆధార్‌లో అడ్రస్‌ మార్చుకోవాలంటే కుటుంబ పెద్ద పాస్‌పోర్ట్‌, రేషన్‌ కార్డ్‌ లేదా వివాహ ధ్రువీకరణపత్రం సమర్పించి అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబసభ్యులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) సులువుగా అడ్రస్‌ను అప్‌డేట్‌ చేసుకోగలరు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా దీనికి అర్హులు.’’ అని ఉడాయ్‌ తెలిపింది.

ఈ సేవల కోసం దరఖాస్తుదారు మై ఆధార్‌ (My Aadhaar) పోర్టల్‌లోకి వెళ్లి ₹ 50 రుసుము చెల్లించి, తమ కుటుంబ పెద్ద ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేయాలి. తర్వాత ఒక సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ (SRN) జారీ అవుతుంది. దరఖాస్తుదారు అడ్రస్‌ అప్‌డేట్‌ కోరినట్లు కుటుంబ పెద్ద ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ ద్వారా అభ్యర్థన పంపబడుతుంది. ఆ అభ్యర్థనను కుటుంబ పెద్ద ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఎస్‌ఆర్‌ఎన్‌ జారీ అయిన 30 రోజుల వ్యవధిలోపు పూర్తి కావాలి. ఒకవేళ కుటుంబ పెద్ద నిర్ణీత వ్యవధిలోపు అడ్రస్‌ అప్‌డేట్‌ కోసం పంపిన అభ్యర్థనను తిరస్కరించినా, ధ్రువీకరించకున్నా ఎస్‌ఆర్‌ఎన్‌ ముగిసిపోతుంది. దీంతో యూజర్‌ కొత్తగా మరో ఎస్‌ఆర్‌ఎన్‌ను ప్రారంభించాలి.

Leave A Reply

Your email address will not be published.