సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు రాగా, ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడం తీవ్ర విమర్శలపాలైంది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సమానత్వం స్ఫూర్తిని చాటేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి ప్రధాని హాజరైతే రాజకీయ చేయడం మీకే చెల్లుతుందని అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
“హైదరాబాదు పాతబస్తీలో వందల సంఖ్యలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఎంఐఎం పార్టీకి మద్దతుగా నిలిచిన చరిత్ర మీది. తద్వారా మీ రాచరికపు పాలనకు మరింత మకిలి అంటుకుంది. ఈ విషయాన్ని ధర్మప్రవచనాలు వల్లించేవారు గ్రహించాలి” అని కిషన్ రెడ్డి హితవు పలికారు.
అయితే, కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. “మొన్న ఐటీఐఆర్ ఇవ్వకున్నా దిగ్గజ ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం. నిన్న జాతీయహోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. నేడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి అండగా మేము… దేశానికే దండగ మీరు!” అంటూ ట్వీట్ చేశారు.
TAgs: KTR, Kishan Reddy, Narendra Modi, Hyderabad, TRS BJP, Telangana