ముచ్చింతల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్‌, ‌డీజీపీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : ముచ్చింతల్‌లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డిలు శుక్రవారం ముచ్చింతల్‌లో సమీక్షించారు. అడిషనల్‌ ‌డీజీలు జితేందర్‌, ఇం‌టలిజెన్స్ అడిషనల్‌ ‌డీజీ అనిల్‌ ‌కుమార్‌, ‌సైబరాబాద్‌ ‌సిపీ స్టీఫెన్‌ ‌రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ ‌కుమార్‌ ‌వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ముచ్చింతల్‌ ‌శ్రీరామ నగరాన్ని సందర్శించారు. ఈ నెల 14 వ తేదీ వరకు జరిగే  శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన ఏర్పాట్లను సిఎస్‌, ‌డీజీపీలు పరిశీలించారు.

ముందుగా, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ను పరిశీలించారు. మొత్తం ముచ్చింతల్‌ ‌ప్రాంతాన్ని, ఇక్కడికి వొచ్చే మార్గాలన్నింటిని కవర్‌ ‌చేసిన  సిసి టీవీలను పరిశీలించే ప్రత్యేక కంట్రోల్‌ ‌రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో వొచ్చే అనుకూల, ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలు అందచేసే విభాగాన్ని సిఎస్‌, ‌డీజీపీ పరిశీలించారు. అనంతరం, 1035 యాగ కుండలిలు ఏర్పాటు చేసిన యాగశాలను, అక్కడ అగ్నిమాపక శాఖ, విద్యుత్‌, ‌శానిటేషన్‌ ‌విభాగాలు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్‌ను, ప్రధాని స్వల్ప బస చేసే గెస్ట్ ‌హౌస్‌ను పరిశీలించారు. ప్రపంచంలొనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహ స్థలాన్ని సోమేష్‌ ‌కుమార్‌, ‌మహేందర్‌ ‌రెడ్డిలు పరిశీలించారు. ప్రధాని ఆవిష్కరించనున్న సమతా మూర్తి విగ్రహ పరిసర ప్రాంతాలు, ప్రధాని వొచ్చే మార్గాలను పరిశీలించారు. ప్రధాని తోపాటు పాల్గొనే వారి జాబితాను కచ్చితంగా ఎస్‌పీజి అనుమతించాల్సి ఉంటుందని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఇక్కడే ఏర్పాటుచేసిన లేజర్‌ ‌షో ప్రాంతంలో బందోబస్తును సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం, ప్రధాన యాగశాలకు చినజీయర్‌ ‌స్వామి నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం, ప్రధాని దిగనున్న శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌కు వెళ్లి ఏర్పాట్లను సిఎస్‌, ‌డీజీపీ పరిశీలించారు.

arrangements in MuchhinthalCelebration in MuchhinthalCS and DGPpm modi arriving to telananaprajatantra newstelangana updatesToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment