బడ్జెట్‌లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్ ఎంపీల ప్రకటన
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : బిజేపి చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం బడ్జెట్‌లో లేదని, బిజేపితో సాత్..దేశ్ కా వినాశ్ అన్నట్లుగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పూర్తిగా ప్రజా, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని అన్నారు. దేశంలో ముందున్న తెలంగాణకు కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇప్పుడు చెప్తున్నవి కేసీఆర్ ముందే తెలంగాణలో చేసి చూపించారన్నారు. అయితే, దేశంలో 5 ట్రిలియన్ ఎకానమీ తీసుకువస్తామని 2018 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని గుర్తు చేశారు. కానీ, ప్రపంచంలో అప్పుడు ఉన్న ఆరో స్థానంలోనే భారత్ ఇప్పుడు ఉందన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే దేశానికి 375 లక్షల కోట్ల జీడీపి అవసరం అన్నారు. అయితే, గతేడాదే తెలంగాణ రూ.10 లక్షల కోట్ల జీడిపిని చేరుకుందన్నారు.
ఇది టార్గెట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అని చెప్పారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ జీడిపి రెట్టింపు అయ్యిందన్నారు. 2016లో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పిన కేంద్రం, ఎందుకు సాధించలేకపోయారో బుధవారం పార్లమెంట్‌లో ఇచ్చిన స్పీచ్‌లో ప్రధాని చెప్పలేదన్నారు. మోడీ ఇప్పుడు చెబుతున్నవి అన్నీ తెలంగాణలో అమలవుతున్నయన్నారు. సాగు నీరు, తాగు నీరు ఇలా అన్నింటిలో రాష్ట్రం ముందుందని చెప్పారు. వ్యవసాయంలో కూడా మూలధన వ్యయం ఉండాలని, అప్పుడే ఆధునీకరణ జరుగుతుందని రంజిత్ రెడ్డి అన్నారు. ఎంఎస్పీకి నిధులు పెట్టామని అంటే సరిపోదని, ఎంఎస్పీ చట్టం అవసరమన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేటాయింపులు చేసారే తప్పా తెలంగాణకు ఏ రంగంలో సరైన కేటాయింపులు జరగలేదన్నారు. పీఎం కిసాన్ నిధుల కన్నా, కేసీఆర్ రైతు బంధు నిధులే ఎక్కువని అన్నారు.
కేంద్రానిది దళిత వ్యతిరేక బడ్జెట్…
కేంద్ర ప్రభుత్వానిది దళిత, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని ఎంపి వెంకటేశ్ నేతకాని అన్నారు. దేశంలో 40 కోట్లు ఉన్న ఎస్సి, ఎస్టీలకు బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ నిధుల్ని ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిందన్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్‌లో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కొరోనా క్లిష్ట సమయంలో ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించలేని స్థితిలో బిజెపి ఉందని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనారిటీలు, రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బిజెపికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తుందన్నారు. వ్యవసాయం, డ్యామ్ సేఫ్టీ, ఎన్‌ఐఏను తన గుప్పెట్లోకి తీసుకుందన్నారు. రాజ్యాంగాన్ని బిజెపి రాజ్యాంగంగా మార్చుకుందని ఆరోపించారు. బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వనందుకు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు నిరసనలు చేయాలని సూచించారు.