22 కిలోల గంజాయి స్వాధీనం

*గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు*

*22 కిలోల గంజాయి స్వాధీనం.*
*సూర్యాపేట:* సూర్యాపేట జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వివరించారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌,గరిడేపల్లి, నడిగూడెం పోలీసులు మంగళవారం తెల్లవారుజాము నుంచి వాహనాల తనిఖీలు చేపట్టారు.హైదరాబాద్‌ కు చెందిన ఠాకూర్‌ నిఖిల్‌సింగ్‌, సారగండ్ల మహేష్‌,రోహన్‌ రాజ్‌పుత్‌,కాలు తివారిలు జల్సాల ఖర్చుల కోసం సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచించారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అరకు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అందు లో భాగంగా ఈ నెల 5వ తేదీన కారును అద్దెకు తీసుకుని అరకు వెళ్లి అక్క డ 20కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఈ నెల 9వ తేదీన గంజాయిని హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు.నలుగురిలో రోహన్‌ రాజ్‌పుత్‌,కాలు తివారి బస్సులో హైదరాబాద్‌కు వెళ్లిపోయా రు.మిగిలిన ఠాకూర్‌ నిఖిల్‌సింగ్‌,సారగండ్ల మహేష్‌ కలిసి కారులో గంజాయిని తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు.జిల్లా సరిహద్దు కోదాడ మండలం రాంపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండటాన్ని గమనించి హుజూర్‌నగర్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలో హుజూర్‌నగర్‌ వద్దకు రాగానే పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా,20 కిలోల గంజాయి లభించింది.కారుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్టణం జిల్లా పద్మనాభ మండలానికి చెందిన విజయ్‌కుమార్‌, బాపట్ల జిల్లాకు చెందిన బంగారు రాజు హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు.వీరికి మిత్రులతో కలిసి గంజాయి పీల్చే అలవాటు ఉంది. దీంతో ఉద్యోగం చేయగా వచ్చే వేతనం సరిపోకపోవడంతో విశాఖపట్నం ప్రాంతం నుంచి మూడు నెలలకు ఒకసారి గంజాయిని కొనుగోలు చేసి దానిని హైదరాబాద్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం వెళ్లి అక్కడ కిలోన్నర గంజాయిని కొనుగోలు చేసి తిరిగి బస్సులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో నడిగూడెం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా బస్సును కూడా తనిఖీ చేయగా గంజాయి లభించింది. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో పాటు నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేష్‌ పారామెడికల్‌ విద్యను అభ్యసించాడు. అనంతరం కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అదేవిధంగా గంజాయి పీల్చేందుకు అలవాటు పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి వద్ద సుమారు 800 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి దానిని సంచిలో పెట్టుకుని గరిడేపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.అతడి వద్ద ఉన్న సంచిలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.దీంతో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మూడు కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు.అనంతరం ఐదుగురిని కోర్టులో రిమాండ్‌ చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్న పోలీసులకు అభినందించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌,మునగాల సీఐలు రామలింగారెడ్డి, ఆంజనేయులు,ఎస్‌ఐలు ఏడుకొండల్‌,వెంకటరెడ్డి, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment