వరంగల్, ఫిబ్రవరి 11: మేడారం వెళ్లాలనున్నా వెళ్లలేకపోతున్నారా? మొక్కు చెల్లించలేకపోతున్నామని చింతిస్తున్నారా? ఇక ఆ చింత వీడండి. మీలాంటి వారి కోసమే.. తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించి. బంగారం(బెల్లం ప్రసాదం) పంపడం మీ వంతు.. దేవాదాయ శాఖ సహకారంతో అమ్మవారికి సమర్పించడం మా వంతు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా టీఎస్‌ఆర్‌టీసీ బస్ స్టేషన్ పార్శల్ కౌంటర్ల ముందుకు వెళ్లడమే. అవును.. ఐపీఎస్ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను లాభాల పట్టించేందుకు, ఆర్టీసీసి ప్రజలకు చేరువ చేసేందుకు అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. తెలంగాణలోనే కాక, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరను పురస్కరించుకుని ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పథకం తీసుకువచ్చారు.
మేడారం వెళ్లలేకపోయిన వారు.. అమ్మవారికి మొక్కులకు చెల్లించేందుకు అవకాశం కల్పించేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారికి బంగారం(బెల్లం) పార్శిల్ ద్వారా పంపిస్తే.. అక్కడ ఆ మొక్కులను అమ్మవారికి చెల్లించేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం కింద భక్తులు.. ఎవరైతే అమ్మవారికి బంగారం చెల్లించాలనుకుంటారో వారు నేరుగా టీఎస్ఆర్‌టీసీ బస్‌స్టాండ్లలోని పార్శిల్ కౌంటర్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. అలా బంగారం ను మేడారం సమ్మక్క సారలమ్మకు పంపించవచ్చు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఒక ప్రటకన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. 5 కేజీల వరకు బంగారం(బెల్లం) అమ్మవారి చెంతకు చేరుస్తారు.
బుకింగ్ పాయింట్ నుంచి మేడారానికి ప్రసాదం తీసుకెళ్లడానికి ఛార్జీలు ఇలా ఉన్నాయి. 200 కిలోమీటర్ల వరకు రూ.400. ఆపైన కిలోమీటర్లకు రూ.450 చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.భక్తులకు ప్రసాదం అందజేత.. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. జాతర ముగిసిన తరువాత 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమ, ఫోటోను భక్తులకు అందజేస్తారు. ఇందుకోసం అదే బుకింగ్ కౌంటర్ వద్దకు భక్తులు వెళ్లవలసి ఉంటుంది.