తోట త్రిమూర్తులు ను ఎమ్మెల్సీ గా తొలగించాలి

దళితులకు శిరోముండనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులును  ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని  దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. వివిధ రాజకీయ , సామాజిక పార్టీలు, దళిత, ప్రజా సంఘాల విస్తృతస్థాయి సమావేశాన్ని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఏ ప్రాతిపదికన ఇచ్చారని జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత తెదేపా ప్రభుత్వం తోటపై కేసులు ఎత్తివేస్తూ జీవో ఇస్తే దాన్ని హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. అతను పార్టీలు మారుతూ ఊసరవెల్లిలా తన అవసరాల కోసం రంగులు మారుస్తూ దళితులకు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు.

అతణ్ని రీకాల్‌ చేస్తూ శిరోముండనం కేసును సత్వరం పరిష్కరించి శిక్ష వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 12 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు దశల వారీగా ఉద్యమం చేయాలని సమావేశంలో తీర్మానించారు. 12న రామచంద్రపురంలో, 17న రాజమహేంద్రవరంలో, 26న పెద్దాపురం డివిజన్‌లో, 30న అమలాపురంలో, ఆగస్టు 6న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయాలని తీర్మానించారు. అంతకు ముందు భీమాకోరేగావ్‌ ఘటనలో నిర్భంధానికి గురై మరణించిన స్టాన్‌స్వామికి సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ఎం.దుర్గాప్రసాద్‌, కాశీబాలయ్య, మోర్త రాజశేఖర్‌, పి.సత్యనారాయణ, ఎ.సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఏనుగుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment