హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకుండా వందలాది మంది ప్రజల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని 200 కిలోమీటర్ల లోతులో ఓటర్లు పాలిపెట్టారని, ఇంకెక్కడి సోనియమ్మ రాజ్యం వస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవాళ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి టిపిసిసి అధ్యక్ష పదవి రావడానికి కెసిఆర్ కారణమని, 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి నువ్వెట్లా గెలిచావని ప్రశ్నించారు. పొత్తుతో ఆనాడు గెలిచి ఇవాళ రాష్ట్ర మంత్రి కెటిఆర్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. కెసిఆర్, కెటిఆర్ లు ఆదేశిస్తే రేవంత్ రెడ్డిని మూడువందల కిలోమీటర్ల లోతులో తొక్కి పాతరేస్తామని హెచ్చరించారు. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఆకునూరి మురళీ ఎవరికి సలహాదారుడిగా ఉన్నాడో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రాకు చెందిన అధికారి పట్ల అంత ప్రేమ ఎందుకో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి ప్రస్తావించిన పేర్లలో ఐఏఎస్ అధికారులు ప్రదీప్ చంద్ర, మురళీ ఆంధ్రా ప్రాంతం వారన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభలో రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.