హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఇద్దరు మహిళల రేప్ ఘటనపై అధికారులతో కమిటీ వేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు గ్యాంగ్ రేప్ జరిగిందని ఎవరూ తనకు ఫిర్యాదు చేయలేదన్నారు.
సోమవారం మధ్యాహ్నం ఇద్దరిపై అత్యాచారం జరిగిందని ఎస్ఎంఎస్ రాగా వెంటనే చిలకలగూడా పోలీసు స్టేషన్ కు పంపించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారని, విచారణ జరుగుతోందన్నారు. బాధిత మహిళలకు మత్తు మందు ఇచ్చి మూడు రోజుల పాటు గదిలో బంధించడం వంటి పరిస్థితులు ఆసుపత్రిలో లేవన్నారు. సిసి కెమెరాలు పనిచేస్తున్నాయని, పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అటెండెంట్లు ఉండే షెడ్ లో బాధితురాలు ఒకరు కన్పించారని, రేప్ సెల్లార్ లో జరిగే అవకాశమే లేదన్నారు. అక్కడ క్యాంటిన్, మెడికల్ స్టోర్, ధోబీ ఘాట్ లు ఉన్నాయని, అందువల్ల అక్కడ రేప్ జరిగే అవకాశం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు విచారణ జరుపుతున్నారని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.