దళిత వ్యతిరేకి సిఎం కెసిఆర్: రేవంత్

రంగారెడ్డి: సిఎం కెసిఆర్ దళిత వ్యతిరేకి అని, ఆయన పాలనలో దళితులకు జరిగిన అవమానం ఏ ప్రభుత్వంలో జరగలేదని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ తన ఏడేళ్ల పాలనలో అడుగడుగునా దళితులను వంచించి హుజూరాబాద్ లో ఓట్ల కోసం దళిత బంధు ప్రారంభించారని ఆయన అన్నారు.

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం రావిర్యాలలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ వస్తే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. గవర్నర్ నరసింహన్ కన్పిస్తే అడ్డంగా పడుకుని కాళ్లు మొక్కేవాడు. దళిత బిడ్డ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వస్తే నమస్తే కూడా చేయకుండా అవమానించిన సిఎం కెసిఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, డిజిపి గా అనురాగ్ శర్మ లకు పదవీ కాలం పొడిగించిన కెసిఆర్ ఐఏఎస్ అధికారి కె.ప్రదీప్ చంద్ర విషయంలో మాత్రం వివక్ష చూపించారన్నారు. ఒకే ఒక నెల పాటు ప్రదీప్ చంద్రను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించి దళితుల పట్ల తనకున్న వివక్షను ప్రదర్శించారన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళీ దళితుడు కావడం మూలంగానే పూర్తికాలం పనిచేయకుండా బదిలీ చేసి పనిలేని శాఖలో పోస్టింగ్ ఇచ్చి అవమానం చేశారన్నారు. ఈ బానిస బతుకు బతకలేను, దొరల పాలన తనకొద్దు అంటూ పాలమూరి బిడ్డ, ఐపిఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బిఎస్పీ లో చేరారన్నారు. దళితులు, దళిత అధికారుల పట్ల అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్న కెసిఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసం కొత్త నాటకం మొదలు పెట్టారన్నారు. దళిత బంధు పథకం ప్రారంభం కొత్త మోసానికి తెరలేపారని, ఈ నిజాన్ని గ్రహించి కెసిఆర్ ను కన్పించకుండా తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

నిన్నటి వరకు సిఎం కార్యాలయంలో దళితులకు అవకాశం ఇవ్వని కెసిఆర్, హుజాూరాబాద్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం బొజ్జా తారకం కుమారుడు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను నియమించుకున్నాడన్నారు. ఏడేళ్లు దళిత ఐఏఎస్ అధికారి లేకుండా కెసిఆర్ జాగ్రత్తపడ్డారని రేవంత్ విమర్శించారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలు, ఉద్యమకారులను బజారునపడేసిన సిఎం కెసిఆర్, ఆయన కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కెసిఆర్ సిఎం, కుమారుడు కెటిఆర్ మంత్రి, మేనల్లుడు హరీశ్ రావు మంత్రి, కుమార్తె కవిత ఎమ్మెల్సీ, మరదలి కుమారుడు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు అయ్యాడన్నారు. ప్రజల కోసం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబం రాబంధుల్లా పీక్కుతింటున్నదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో దళితులు, గిరిజను తీవ్ర దోపిడికి గురయ్యారని రేవంత్ అన్నారు. మంత్రి కెటిఆర్ అనే సన్నాసి ఐఏఎస్ కావాలని అనుకున్నాడంట, ఈ వార్తను చదివిన తనకు నవ్వొచ్చిందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కెకె.మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తే గద్దలాగా కెటిఆర్ తన్నుకుపోయాడన్నారు.

cm kcr familydalitha bandhuMinister KTRmla seethakkamp revanth reddytelangana dalithstpcc president revanthtrs bhavan
Comments (0)
Add Comment