వైద్యారోగ్య‌ శాఖ మంత్రి హరీష్ రావుతో అమెరికా డాక్టర్ల బృందం భేటీ

హైద‌రాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో బీఆర్ఎస్ గ్లోబ‌ల్ కోఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల ఆధ్వ‌ర్యంలో బెజ్జంకి హ‌న్మంత్‌తో పాటు అమెరికా డాక్ట‌ర్ల బృందం భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా వివిధ అంశాలపై చర్చ జరిగింది. మొదటగా హన్మంత్ బెజ్జంకి డాక్టర్ల బృందాన్ని మంత్రి హరీష్ రావుకు ప‌రిచ‌యం చేశారు.ఏఏపీఐ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- అమెరికాలో వైద్య పూర్వ విద్యార్ధులు, 80000 మంది భారతీయ సంతతికి చెందిన వైద్యులు ఉన్నారు. అలాగే ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ మెడికల్ అలుమ్ని ఆఫ్ అమెరికా (OGKTMA) తెలంగాణ, హైదరాబాద్ నుండి సుమారు 20000 మంది వైద్యులు ఉన్నారని తెలిపారు.ఈ సంద‌ర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ మెడికల్ సీట్ల కోసం తెలంగాణా విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళే పని లేకుండా మెడికల్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారని తెలిపారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్ కాలేజీలను నిర్మించి వైద్య విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందాల్సిన అవసరం ఉందని సీఎం సూచనలు చేశార‌ని తెలిపారు. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలు, నవజాత శిశు సంక్షేమం గురించి కేసీఆర్ కిట్,అమ్మ ఒడి పథకం అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటైన బస్తీ దవాఖానాలకు విశేష స్పంద‌న ల‌భిస్తుంద‌న్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని పేద‌ల‌కు వైద్య ఖ‌ర్చుల భారాన్ని త‌గ్గిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

ఈ భేటీలో డాక్ట‌ర్ హన్మంత్ బెజ్జంకి, డాక్ట‌ర్ సతీష్ కత్తుల, డాక్ట‌ర్ మెహెర్ మేదేవరం, డాక్ట‌ర్ రఘు లోలాభట్టు, డాక్ట‌ర్ సుజీత్ పున్నం, డాక్ట‌ర్ శ్రీని గంగసాని, డాక్ట‌ర్ హేమ కొర్లకుంట, డాక్ట‌ర్ జితేందర్ రెడ్డి కట్కూరి, డాక్ట‌ర్ రామారావు మేడవరం, డాక్ట‌ర్దామోదర్ నేరెళ్ల పాల్గొన్నారు, ఈ భేటీని సమన్వయ పరిచిన బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు డాక్ట‌ర్ హన్మంతు బెజ్జంకి, డాక్టర్ల బృందం అభినందించింది.

Comments (0)
Add Comment