జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ధర్మకర్తల మండలికి దరఖాస్తుల స్వీకరణకు ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు వ్యవహారాలతో మూడేళ్లుగా కాళేశ్వరాలయం దేవస్థానం ధర్మకర్తల మండలి లేక ఖాళీగా ఉంది. ప్రస్తుతం దేవదాయశాఖ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నిహితుడు సిద్దిపేటకు చెందిన బొమ్మర వెంకటేశం 2018 నుంచి 2020 వరకు చైర్మన్ గా విధులు నిర్వహించారు.
బొమ్మెర వెంకటేశం పదవి ముగియకముందే కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధర్మకర్తగా ఉన్న గంట రాంనారాయణగౌడ్ 40 రోజుల పాటు చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన పదవి ముగియడంతో ఆ తర్వాత పాలక మండలి నియామకం జరుగలేదు. తెలంగాణ ఏర్పడక ముందు పాలకమండలి,ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్య 9 మందికే పరిమితం కాగా, పాలకమండలి సంఖ్యను 14 మందికి పెంచింది.
ప్రస్తుతం నోటిఫికేషన్ వెలువడటంతో ఆసక్తి గల అభ్యర్థులు అధికార పార్టీ నేతల వద్దకు పరుగులు తీస్తున్నట్లు తెలిసింది. ఓవైపు అంతరాష్ట్ర వంతెన మరోవైపు కాళేశ్వరం పంప్ హౌస్ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అన్నారం భ్యారేజీలు నిర్మించడంతో కాళేశ్వరం పేరు నలుమూలల వ్యాపించింది.దీంతో కాళేశ్వరం పాలకమండలి చైర్మన్ పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది.వివిధ జిల్లాలకు చెందిన వారు కూడా పాలకమండలి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 లోగా దరఖాస్తులకు ఆహ్వానం ఉండగా ఇప్పటివరకు ఇంకా దరఖాస్తులు ఏమి రాలేదని తెలిసింది.