సరల్ యాప్ ను ప్రారంభించిన బండి సంజయ్

హైదరాబాద్: పోలింగ్‌ బూత్‌ కమిటీ సమ్మేళనంతో భాజపా బలమెంతో అర్థమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా పోలింగ్ బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘సరల్‌ యాప్‌’ను ఆయన ప్రారంభించారు. సరల్‌ యాప్‌లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను పొందుపరుస్తున్నామని బండి సంజయ్‌ వివరించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ బూత్‌ కమిటీల ద్వారానే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారు. భాజపాకు పోలింగ్ బూత్‌ స్థాయి కమిటీలే మూల స్తంభం. స్మార్ట్‌ సిటీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, హరితహారం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోంది. భారాస సర్కారు సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలి. రుణమాఫీ చేయకపోవడంతో రైతు బంధు డబ్బులను బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి’’ అని బండి సంజయ్‌ వెల్లడించారు.

Comments (0)
Add Comment