ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేదా తెలంగాణలో—పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్‌లు సమిధలు అవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సర్పంచ్‌ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిచ్చామని తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు నిధుల విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ధర్నా చౌక్‌లో ‘రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్’ పేరిట టీపీసీసీ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, ధర్నాకు అనుమతిలేదంటూ ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డిని సైతం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సాయంత్రం బొల్లారం పోలీస్‌స్టేసన్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పల్లె సీమలే పట్టుకొమ్మలన్నారు. ఆ స్ఫూర్తితోనే గ్రామ పంచాయితీ వ్యవస్థలను ఏర్పాటు చేసి పరిపాలన అధికారాలతోపాటు నిధుల వినియోగంలో సర్వాధికారాలను సర్పంచ్‌లకు కట్టబెట్టారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా నిధులను గ్రామపంచాయితీలకు బదిలీ చేస్తూ గ్రామాభివృద్ధికి మంజూరు అయ్యే నిధుల వినియోగాన్ని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు అప్పజెప్పారు. ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ పరిపాలనను అందిస్తే.. తెలంగాణకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థలను, పంచాయితీరాజ్‌ సంస్థలను నాశనం చేశారు. గుత్తాధిపత్యంగా అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు. గ్రామపంచాయితీల నిర్వహణ కోసం ఇవ్వాల్సిన నిధులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయబోమని శాసనసభలో చెప్పారు. గ్రామసర్పంచ్‌లకు చెందాల్సిన దాదాపు రూ.35వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించింది. ఇది చట్టవిరుద్ధం. నియమ నిబంధనలను ఉల్లఘించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.’’ అని రేవంత్‌ అన్నారు.

నిధులను విడుదల చేయకపోవడం ద్వారా గ్రామపంచాయితీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రేవంత్‌ ఆరోపించారు. ‘‘ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, కరెంట్‌ బిల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా చేశారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్‌ అవినీతి, అహంకారంతో రాష్ట్రంలో పంచాయితీరాజ్‌ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. అందుకే సర్పంచ్‌ల కోసం అండగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిస్తే.. కాంగ్రెస్‌ కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారు. అయినా మా పోరాటం ఆగదు. ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనలను కొనసాగిస్తాం. బిల్లుల కోసం సర్పంచ్‌లు మంత్రులను నిలదీయాలని కోరుతున్నాం. మంత్రుల కార్యక్రమాలను అడ్డుకోవాలని సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులను పంచాయితీ ఖాతాల్లో వెంటనే జమచేయాలి. ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

Comments (0)
Add Comment