భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ సంపద రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. వంట నూనెల నుంచి పోర్టుల వరకు ఎన్నో వ్యాపారాలు చేస్తున్న అదానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను అధిగమించారు. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం అదానీ, ఆయన కుటుంబ ఆదాయం 112.9 బిలియన్ డాలర్ల (రూ. 9 లక్షల కోట్ల) కు పెరిగింది.
అదే సమయంలో బిల్‌గేట్స్ సంపద 102.4 బిలియన్ డాలర్ల (రూ. 8.19 లక్షల కోట్ల)కు తగ్గిపోయింది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం బిల్ గేట్స్ తాజాగా 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.60 లక్షల కోట్లు) విరాళం ప్రకటించారు. దాంతో, బిలియనీర్ల జాబితాలో ఆయన ఒక ర్యాంకు తగ్గి ఐదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం బిల్ గేట్స్ కంటే అదానీ ఆదాయం 10 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది.
కాగా, ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 229 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 144 బిలియన్ డాలర్లతో లూయిస్ విట్టన్ ( బెర్నార్డ్ ఆర్నాల్ట్, కుటుంబం) రెండో స్థానంలో ఉండగా.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ (136 బిలియన్ డాలర్లు) మూడో ర్యాంకులో ఉన్నారు. భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 87.3 బిలియన్ డాలర్ల సంపదతో 10 వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
Gautam Adani, billionaire rankings, Bill Gates, 4th rank forbs