చౌతాలా తొమ్మిదిన్నర ఏళ్ళ జైలు శిక్ష తర్వాత విడుదల

న్యూఢిల్లీ: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలు శుక్రవారంనాడు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు అన్నీ పూర్తి కావడంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదయ్యారని జైలు అధికారులు తెలిపారు. 86 ఏళ్ల చౌతాలా ఇప్పటికే పెరోల్‌పై బయట ఉన్నారు. శుక్రవారంనాడు ఆయన జైలుకు వచ్చి లాంఛనాలు పూర్తి చేయడంతో విడుదలకు మార్గం సుగగమైంది. పదేళ్ల శిక్షలో తొమ్మిదిన్నరేళ్ల శిక్ష అనుభవించడంతో పాటు కోవిడ్ పరిస్థితిలో జైలులో ఇరుకు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ హైకోర్టు గత నెలలో ఆయనకు ఆరు నెలల జైలుశిక్షను తగ్గించింది.

చౌతాలా ఇప్పటికే తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల జైలు అనుభవించినందున ఆయన జైలు నుంచి విముక్తి పొండడానికి అర్హులని అధికారులు తెలిపారు.

టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో 2013లో చౌతాలా జైలుకు వెళ్లారు. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి ఆయన ఎమర్జెన్సీ పరోల్‌లో ఉన్నారు. 2021 ఫిబ్రవరిలో ఆయన సరెండర్ కావాల్సి ఉండగా, ఆయన పరోల్‌ను హైకోర్టు ఆరు నెలలు పొడిగించింది. ఫిబ్రవరి 21 నాటికి రెండు నెలల 26 రోజుల పాటు మిగిలి ఉన్న జైలుశిక్షను కోర్టు తగ్గించింది. కాగా, సంక్షోభ సమయంలో తమ కుటుంబం కోసం ప్రార్ధించి, ప్రేమాభిమానాలు చూపించిన అందరికీ తాము రుణపడి ఉంటామని చౌతాలా చిన్న కొడుకు అభయ్ అన్నారు. చౌతాలా మనుమడు దుష్యంత్ 2018లో ఐఎన్ఎల్‌డీని విడిచి జననాయక్ జనతా పార్టీని స్థాపించారు. ఓంప్రకాష్ చౌతాలా విడుదల కావడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. జైలు నుంచి విడుదల అయిన అనంతరం చౌతాలా నేరుగా గురుగావ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

Comments (0)
Add Comment