సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఇదే రోజు సంచలనం సృష్టించిన ఎన్టీఆర్

జనవరి 9.. సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఇదే రోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో ప్రబలిన అరాచకానికీ, దిల్లీ నియంతపాలనకూ చరమగీతం పాడుతూ.. తెరలేచిన ఈ అపూర్వ ఘట్టానికి హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియం వేదికైంది.

దాదాపు మూడు దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తూ.. తెదేపా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన క్షణమది.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌.. 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు.. దేశ రాజకీయ యవనికపై ఓ తిరుగులేని.. చెరిగిపోని చిత్రం

మూడు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో సామాన్యుడి ఘోష బధిరశంఖారావమే అయ్యేది.. దిల్లీ పదఘట్టనల కింద తెలుగువాడి ఆత్మగౌరవం నలిగిపోయేది.. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో మార్పే లక్ష్యంగా, తెలుగువాడి ఆత్మగౌరవమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి, ప్రజలందరికీ చేరువయ్యారు. ఫలితంగా ఆవిర్భవించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ అపూర్వ ఘట్టానికి నేటితో నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి. ప్రపంచంలో నేటికీ ఏ పార్టీకీ సాధ్యం కానంతగా 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగూ.. రాజకీయాల్లో పెను సంచలనమే. ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ఘన విజయం సాధించాక ప్రమాణస్వీకారోత్సవంలోనూ ఎన్టీఆర్‌ విలక్షణతను చాటారు. రాజ్‌భవన్‌లో కొద్ది మంది ఆహూతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే పాతపద్ధతిని పక్కకునెట్టారు. తనను ఎంతగానో ఆదరించి, గుండెల్లో గుడికట్టి ఆరాధించిన అభిమానులు, అశేష ప్రజానీకం మధ్యే లాల్‌బహదూర్‌ స్టేడియంలో అచ్చతెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుంచి పేదలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెదేపా పాలన సాగింది. అదే సమయంలో అభివృద్ధికి, సంస్కరణలకూ సమ ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు, విప్లవాత్మకమైన సంస్కరణలు పాలనలో, రాజకీయాల్లో నేటికీ గీటురాళ్లే.

ఎన్టీఆర్‌ ఆరు పదుల వయసులో ప్రాంతీయ పార్టీని స్థాపించి… ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీనే గుక్కతిప్పుకోకుండా చేసి, అఖండ మెజార్టీ సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ రాజకీయాలు కొనసాగేవి. భూస్వాములు, మోతుబరులు, కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే రాజకీయం ఉండేది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా స్థానాల్లో దాదాపుగా వారే పోటీ చేసేవారు. వెనుకబడిన వర్గాలకు నామమాత్రపు ప్రాధాన్యమే దక్కేది. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం అడుగడుగునా తాండవించేవి. దిల్లీలో రిమోట్‌ కంట్రోల్‌ పెట్టుకుని, ఇక్కడి నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని తోలుబొమ్మల్లా ఆడించేవారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి పెచ్చుమీరింది. తెలుగువారి అస్థిత్వం, ఆత్మాభిమానం దగాపడ్డాయి. ముఖ్యమంత్రులైనా, ఎంత కొమ్ములు తిరిగిన నాయకులైనా.. ఇందిర ముందు సాగిలపడాల్సిందే. దిల్లీ పెద్దల దయాదాక్షిణ్యాల మీదే ముఖ్యమంత్రుల భవిష్యత్తు ఆధారపడేది. పట్టుమని రెండేళ్లు కూడా గడవకుండానే ముఖ్యమంత్రుల్ని మార్చేసేవారు. అప్పట్లో కేవలం ఇందిరాగాంధీ కుమారుడి హోదాలో హైదరాబాద్‌కు వచ్చిన రాజీవ్‌గాంధీ.. ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిన తీరు రాష్ట్ర ప్రజలందర్నీ నొచ్చుకునేలా చేసింది. రాజకీయాల్లో ప్రవేశించి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్న ఎన్టీఆర్‌ సంకల్పాన్ని ఆ సంఘటన మరింత ప్రేరేపించింది. తెలుగువారికి సొంత గుర్తింపు తేవాలన్న పట్టుదలతో, తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశానికి ఆ ఆలోచనే నాంది పలికింది. అలా ఆవిర్భవించిన తెలుగుదేశం.. దేశ రాజకీయాల్లోనే పెనుసంచలనాలు సృష్టించింది.

తెలుగుదేశం పార్టీ గుర్తులోని.. నాగలి రైతులు, గుడిసె పేదలు, చక్రం శ్రామికులకు సంకేతం అని చెప్పడం ద్వారా ఆయా వర్గాల అభిమానాన్ని చూరగొనడం.. తెలుగుదేశం సాధించిన తొలి విజయం.

*యువతకు, విద్యావంతులకు పెద్దపీట*

తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో యువకులు, విద్యావంతులకు అవకాశం కల్పించింది. వెనుకబడిన కులాల్లో రాజకీయ చైతన్యం తెచ్చింది. వారికి అవకాశాలు కల్పించి, గెలిపించి మంత్రి పదవులు కట్టబెట్టింది. 1983 ఎన్నికల్లో పోటీ చేసిన తెదేపా అభ్యర్థుల్లో 28 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజినీర్లు సహా 125 మంది పట్టభద్రులున్నారంటే.. విద్యావంతమైన రాజకీయాలకు తెలుగుదేశం వేసిన బాట నేటికీ సుస్పష్టంగా కనిపిస్తుంది.

*బలహీనవర్గాలకు వెన్నుదన్ను*

కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండేది కాదు. తెలుగుదేశం హయాంలోనే తొలిసారిగా వారికి రాజకీయ గుర్తింపు లభించింది. తెదేపాను స్థాపించాక ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్‌ అమలు చేశారు. దాంతో రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున బీసీలు వచ్చారు. సామాన్యులు కూడా మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్‌ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో వారిలో కొందరు ఎమ్మెల్యేలయ్యారు.

*ఎమ్మెల్యేలకు ప్రవర్తనా నియమావళి*

అధికారంలోకి వచ్చాక తెదేపా రాష్ట్రంలో రాజకీయాల ప్రక్షాళనకు నడుం కట్టింది. మొత్తం 10 అంశాలతో ఎన్టీఆర్‌ శాసనసభ్యులకు ప్రవర్తనా నియమావళి రూపొందించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, ఉద్యోగుల బదిలీలు, నియామకాల్లో జోక్యం చేసుకోరాదని, అవినీతి నిర్మూలనకు సహకరించాలని, మంత్రులు సన్మానాలకు దూరంగా ఉండాలని… ఇలాంటి పలు నిబంధనలు పొందుపరిచారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని, పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని తెదేపా ప్రభుత్వం చాటింది.

విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ

మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.

1985లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1988లో దానికి పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరు పెట్టారు.

దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. తర్వాత దానికి అంబేడ్కర్‌ పేరు పెట్టారు.

*సంస్కరణలకు పెద్ద పీట*

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ హయాంలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి.

ఆంధ్ర ప్రాంతంలో మునసబు, కరణాల వ్యవస్థను.. తెలంగాణలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆరే రద్దు చేశారు.

వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్‌ ఫీజు రద్దు చేశారు. సీట్లు అమ్ముకోవడాన్ని నిషేధించారు.

ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ను తీసుకువచ్చారు.

కంప్యూటర్ల వినియోగాన్ని స్వాగతించారు.

ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధించారు.

దేవాలయాల్లో మిరాసీ విధానంగా పిలిచే వంశపారంపర్య అర్చకత్వ పద్ధతిని రద్దు చేశారు.

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేశారు. దేశంలో అలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం. ఆ తర్వాత 20 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టం తెచ్చింది.

ఎస్సీలకు ఒక శాతం, ఎస్టీలకు 2 శాతం రిజర్వేషన్లు పెంచారు.

మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణలు చేయడానికి చాలా సంవత్సరాల ముందే ఎన్టీఆర్‌ అధికార వికేంద్రీకరణ చేశారు. తాలూకాలు, బ్లాక్‌లకు బదులు రెవెన్యూ మండలాలు, మండల పరిషత్‌లను ఏర్పాటు చేశారు.

జిల్లా, మండల పరిషత్‌లతోపాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మొదటిసారి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించారు.

విప్లవాత్మక పథకాలు

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నమ్మిన ఎన్టీఆర్‌ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.

1983 ఏప్రిల్‌ 14న ఉగాది నుంచి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు వార్షికాదాయం రూ.3,600 వరకు ఉన్న కుటుంబాల్నే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిగా పరిగణించేవారు. దానివల్ల ఎక్కువ మందికి మేలు జరగదని వార్షికాదాయ పరిమితిని రూ.6 వేలకు పెంచారు. ఫలితంగా 1.43 కోట్ల కుటుంబాలకు మేలు జరిగింది.

పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.6 వేలు చొప్పున ఇచ్చారు.

పేదలకు జనతా వస్త్రాల పథకాన్ని ప్రవేశపెట్టి, సగం ధరకే దుస్తులు పంపిణీ చేశారు.

వృద్ధులు, వితంతువులకు రూ.30 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు.

దేవుడిచ్చిన భూమికి శిస్తేమిటి రైతన్నా అంటూ భూమి శిస్తు రద్దు చేశారు.

రైతులు ఎంత విద్యుత్‌ వాడుతున్నారన్నదానితో సంబంధం లేకుండా హార్స్‌పవర్‌ రూ.50కే ఇచ్చారు.

సింగిల్‌ విండో విధానం ప్రవేశపెట్టి, రైతులకు సులభంగా రుణాలు లభించేలా చేశారు.

భూమి లేని నిరుపేదలకు భూ వసతి, మురికివాడల్లోని పిల్లలకు పాలు పంపిణీ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు.

అంతవరకు తీవ్ర నిరాదరణకు గురైన గిరిజనుల సంక్షేమానికి ఎన్టీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని చిన్న ఉద్యోగాలు వారికే చెందేలా చేయడం వంటి 14 నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీడీఏల్ని బలోపేతం చేసి, ఐఏఎస్‌ అధికారుల్ని పీవోలుగా నియమించారు.

తెలుగు గంగ పథకానికి శ్రీకారం

పారిశ్రామిక పురోభివృద్ధికి కృషి
రాష్ట్రంలో విస్తృతమైన పారిశ్రామికీకరణ జరగాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్‌, పరిశ్రమల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా 1984లో వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందాన్ని తీసుకుని అమెరికాలో పర్యటించారు.

1982-83 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారీ, మధ్యతరహా పరిశ్రమలు మొత్తం 390 మాత్రమే. ఎన్టీఆర్‌ హయాంలో మరో 216 వచ్చాయి. అప్పటికి చిన్న తరహా పరిశ్రమలు 37,813 ఉండగా, 1989 నాటికి వాటి సంఖ్య 58,263కి పెరిగింది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్‌ రంగ స్థాపిత సామర్థ్యం 2,608 మెగావాట్లు. నాలుగేళ్లలో దాన్ని 3,604 మెగావాట్ల స్థాయికి తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌, విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, గుంటూరు బస్టాండ్‌ సహా పలు చోట్ల విమానాశ్రయాల్ని తలదన్నేలా బస్టాండ్‌ల నిర్మాణం ఎన్టీఆర్‌ హయాంలోనే జరిగింది.
అంతర్జాతీయ చలనచిత్రోత్సవ నిర్వహణకు హైదరాబాద్‌లో కేవలం మూడు నెలల్లోనే లలిత కళాతోరణం ఆడిటోరియం నిర్మించారు.

హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై తెలుగువెలుగుల నిక్షిప్త కళా ప్రాంగణం పేరిట తెలుగు జాతిలోని మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌ మధ్యలో బుద్ధవిగ్రహం ఏర్పాటు చేశారు.

Comments (0)
Add Comment