ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు రంగంలోకి ఢిల్లీ సిబిఐ

హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దిల్లీ విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కోసం హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సాంకేతిక అడ్డంకులు తొలగిపోయిన తర్వాత దిల్లీలోనే కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ సీబీఐ విభాగం ఉన్నప్పటికీ దిల్లీ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని నుంచి ఎస్పీ స్థాయి అధికారి హైదరాబాద్‌ చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రతిని సీబీఐ అధికారులు సేకరించారు. దాని ఆధారంగా కేసు నమోదు చేయవచ్చు. వాస్తవానికి నేరం జరిగినట్లు భావిస్తున్న పరిధిలోని దర్యాప్తు విభాగమే కేసు కూడా నమోదు చేయాలి. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇతర విభాగాలకు ఈ బాధ్యతలు అప్పగించవచ్చు. ఇదంతా అంతర్గత వ్యవహారం. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం సైబరాబాద్‌ పరిధిలో జరిగింది. దీన్ని సీబీఐకి బదిలీ చేసినా హైదరాబాద్‌ విభాగమే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు దిల్లీ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. అంటే దీన్ని ప్రత్యేక కేసుగా అధికారులు భావిస్తున్నారనుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకప్పుడు హైదరాబాద్‌ సీబీఐ విభాగానికి జాయింట్‌ డైరెక్టర్‌ అంటే ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించేవారు. కానీ, ఇప్పుడు ఓ ఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఈ విభాగాన్ని చూస్తున్నారు. దాంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ కేసు సీనియర్‌ అధికారులు పర్యవేక్షణలో కొనసాగాలన్న ఉద్దేశంతో దిల్లీలోనే ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి నిరాకరిస్తూ ఇదివరకే రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేయాలంటే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సూత్రప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతి తెలియజేయాలని ఓ అధికారి వెల్లడించారు. దీనిలో భాగంగానే కేసు నమోదుకు అంగీకారం తెలపాల్సిందిగా దిల్లీ నుంచి వచ్చిన అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కానీ, దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ఇలాంటి సాంకేతిక అడ్డంకులు తొలగిపోగానే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దిల్లీలోనే కేసు నమోదు చేసి హైదరాబాద్‌ విభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయం నుంచి అధికారులు పనిచేస్తారని.. నిందితులు, అనుమానితులను ఇక్కడకే పిలిపించి విచారిస్తారని భావిస్తున్నారు.

Comments (0)
Add Comment