విజయవాడ, ఫిబ్రవరి 11: ఈ సినిమా వాళ్లను చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలే గుర్తొస్తున్నారు. ఆ రెండు సందర్భాలను కాస్త గమనిస్తే.. సేమ్ టూ సేమ్ ఉందనిపిస్తోంది. అప్పుడు ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో మీటింగ్ తర్వాత ఇలానే బయటకు వచ్చి.. ఆల్ హ్యాపీస్ అంటూ మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు జగన్‌రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ పెద్దలు సైతం త్వరలో శుభం కార్డు పడుతుందంటూ అలాంటి గుడ్‌న్యూసే చెబుతున్నారు. కానీ, జరగబోయేది ఏంటో లోనున్న జగనన్నకు మాత్రమే తెలుసు. అంతా జగన్మాయ అంటున్నారు.నెల రోజులు వెనక్కి వెళితే… అప్పటి వరకూ 27 శాతం ఐఆర్ తీసుకుంటూ కాస్త హ్యాపీగానే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. జగనన్న పీఆర్సీ వేశారు. ఉద్యోగులు ఖుషీ అయ్యారు. కొత్త పీఆర్సీతో జీతాలు భారీగా పెరుగుతాయని ఆశించారు. తీరా చూస్తే.. ఫిట్‌మెంట్ 23శాతానికే సరిపెట్టారు. సీసీఏ తీసేశారు. హెచ్ఆర్ఏ కోతేశారు. డీఏలతో కవర్ చేశారు. ఉన్నజీతం తగ్గిపోవడంతో.. లబోదిబోమంటూ ఉద్యోగులంతా రోడ్డెక్కారు. చలో విజయవాడతో ముచ్చెమటలు పట్టించారు. జగనన్న ఉద్యోగ సంఘ నేతలను మరోసారి చర్చలకు పిలిచారు. మసిపూసి మారేడుకాయ చేసి.. మమ అనిపించారు. తీసేసిన సీసీఏ తిరిగిచ్చేశారు. భారీగా తగ్గించిన హెచ్ఆర్ఏను కాస్త పెంచారు. ఫిట్‌మెంట్ మాత్రం అంతే ఉంచారు. ఇక పండుగ చేసుకోండంటూ సీఎం సెలవిచ్చారు. నేతలంతా సరేనంటూ తలూపి వచ్చేశారు. వచ్చాక తెలిసింది.. ఈసారి కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదని. జీతం పెరిగిందేమీ లేదని. ఇక, ఉపాధ్యాయులైతే తమకు తీవ్రంగా నష్టం జరిగిందని మళ్లీ ఉద్యమిస్తున్నారు. ఇదంతా ఇప్పటి వరకూ నడిచిన పీఆర్సీ ఎపిసోడ్. ఇప్పుడు నడుస్తున్న టాలీవుడ్ ఎపిసోడ్ సైతం దాదాపు ఇలానే ఉందంటున్నారు. సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గించేసి.. మరీ 5 రూపాయలకే టికెట్ అమ్మాలని రూల్ పెట్టి.. ఏపీలో వందలాది థియేటర్ల మూతకు కారణమైంది జగన్ ప్రభుత్వం. మొదట్లో పవన్‌కల్యాణే టార్గెట్ అయ్యారు.
మిగతా వాళ్లంతా తమకెందుకులే వాళ్లూ వాళ్లూ చూసుకుంటారని అన్నీ మూసుకున్నారు. వకీల్ సాబ్ సీజన్ అయిపోయాక గానీ తెలిసిరాలేదు ఆ కోతతో వాతలు తమకూ తేలుతున్నాయని. ఇక అంతే. అంతా నెత్తీనోరూ బాదుకున్నారు. పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు.. అందరికీ జగనన్న దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. ఆ దెబ్బను అఖండ, పుష్పలు ఎలాగోలా కాచుకు నిలబడ్డాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లు సాకులు వెతికాయి. ఆచార్య, భీమ్లానాయక్, సర్కారు వారి పాట.. అంతా హడలిపోయారు. బాబ్బాబూ అంటూ జగనన్న ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదర్శనలు చేశారు. రాఘవేంద్రరావు, రాజమౌళి, చిరంజీవిలాంటి పెద్దలంతా రిక్వెస్ట్ చేశారు.. అయినా, జగనన్న పట్టించుకోలేదు. పీకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాగార్జున తనకేమీ ప్రాబ్లమ్ లేదంటూ.. బంగార్రాజును సంక్రాంతి బరిలో దించేశాడు. ప్రభుత్వం పరోక్షంగా నాగ్ సినిమాకు కావలసినంతా సాయం చేసిందంటారు. ఇక, అసలు సినిమాల సమయం ఆసన్నం కావడం.. అంతలోనే టీడీపీ అధినేత చంద్రబాబు చిరంజీవిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. జగనన్న మళ్లీ పావులు కదిపారు. చిరును ఇంటికి పిలిపించుకుని.. విందు రాజకీయం నెరిపారు. రాజ్యసభ ఆఫర్ అంటూ పలు లీకులు.. కాదంటూ ఖండనలు. త్వరలో గుడ్‌న్యూస్ అంటూ చిరంజీవి అప్పుడే హింట్ ఇచ్చేశారు.
మధ్యలో ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చి కాస్త మసాలా దట్టించారు. మంత్రి పేర్ని నాని ఈ మొత్తం ఎపిసోడ్ ను ఎప్పటికప్పుడు రక్తి కట్టించారు.కట్ చేస్తే.. ప్రభుత్వం ఓ కమిటీ వేసి.. టాలీవుడ్‌కు తేలిన వాతలకు పైపూత పూసే పని చేపట్టింది. చిరంజీవి ఒక్కరినే పిలిస్తే తేడా వచ్చేలా ఉందని.. ఈసారి చిరుతో పాటు పెద్దగా నోరెత్తలేని మహేశ్‌బాబు, ప్రభాస్‌లనూ రప్పించుకున్నారు. తన సినిమాల కోసం రాజమౌళి, కొరటాలలూ వెళ్లారు. ఆర్.నారాయణమూర్తి ఈమధ్య జగనన్నను బాగా లవ్ చేస్తున్నారు కాబట్టి ఆయనా అటెండెన్స్ వేసుకున్నారు. అయితే, ప్రస్తుతం సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న ఆలీ, పోసానిలు సైతం తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యక్షమవడం ఆసక్తికరం, బహుషా వాళ్లిద్దరి మెడలో ఉండే వైసీపీ కండువాలే వారిని లోనికి అనుమతించాయేమో!మరి, ఇంత డ్రామా చేసి ఏం తేల్చారు? మళ్లీ అదే డైలాగ్. త్వరలో గుడ్‌న్యూస్. జగనన్న సానుకూలంగా ఉన్నారనే ట్రాక్. తగ్గించిన రేట్లు మళ్లీ సవరిస్తారని.. ఐదో షోకు అనుమతిస్తారని.. విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తారని లీకులు. ఇందులో కొత్త విషయం ఏముందో అర్థం కాదు. తగ్గించిన టికెట్ రేట్లను సవరిస్తే కూడా గొప్ప విషయమేనా? ఎవరు తగ్గించమన్నారు.. తగ్గించిన రేట్లు పెంచితే మంచి చేసినట్టు ఎలా అవుతుంది? ఇప్పటికే జరిగిన నష్టానికి, మూతపడిన థియేటర్లకు, పడిన మానసిక వేధనకు ఎవరు బాధ్యులు? విశాఖలో సినీ పరిశ్రమకు ప్రోత్సాహం ఎవరి ప్రయోజనాల కోసం? కొందరు టాలీవుడ్ ప్రముఖుల కోసమా? లేక, వైసీపీ పెద్దల కోసమా? అనే అనుమానం. మొత్తానికి సీఎం జగన్.. టాలీవుడ్‌తో కొన్ని నెలలుగా ఆడుతున్న ఆటలో పరిశ్రమ ప్రముఖులంతా ఆటలో అరటిపండ్లు అయ్యారనిపిస్తోంది. జగనన్న కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వారికి అర్థం కావాలంటే.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను ఓసారి అడిగి చూడండి తెలుస్తుంది.. జగన్నాటకం గురించి.. అందులో రక్తికట్టేంచే చర్చల సీన్ల గురించి. ఎనీ డౌట్స్?.