చోడవరం వైస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే బాగుండేది : రావు సుబ్రహ్మణ్యం

చోడవరం వైస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే బాగుండేదని,మూడు రాజధానుల కోసం ఆయన రాజీనామా చేయడంతో వైస్సార్సీపీ బేలతనం బయటపడింది అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.ఈమేరకు ఇవాళ ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికి తేలేకపోయిన జగన్ వైఖరికి నిరసనగా వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే హుందాగా ఉంటుంది అని అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర సెగకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేక పోతున్నారని ఎద్దేవాచేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని స్వార్ధంతో పాదయాత్ర చేశారని, ఇపుడు రైతులు నిస్వార్థంగా అమరావతి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్నారు కనుకే ముఖ్యమంత్రి కుర్చీ కూసాలు కదులుతాయి అనే భయంతో రాజీనామాల నాటకానికి తెరతీశారు అని రావు సుబ్రహ్మణ్యం విమర్శించారు.దమ్ముంటే రాజధాని అమరావతి రైతులపై కాకుండా కేంద్రం పై పోరాడాలని,ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments (0)
Add Comment