కాల పరిమితి లేకుండా సబ్ ప్లాన్ చట్టం పునరుద్ధరించాలి. రావుసుబ్రహ్మణ్యం

*కాల పరిమితి లేకుండా సబ్ ప్లాన్ చట్టం పునరుద్ధరించాలి..నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం*

*విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాజకీయ పార్టీలు,దళిత,బహుజన సంఘాల ప్రతినిధుల డిమాండ్*

*కాలపరిమితి (టైం బాండ్) తో సంబంధం లేకుండా,ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందని, దోచుకోవటం, దాచుకోవటానికి పరిమితమైందని విమర్శించారు. సబ్ ప్లాన్ అమలు పై ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదే అంశాన్ని పలు దళిత, బహుజన సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్రాసిన బహిరంగ లేఖలను విడుదల చేశాయి. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహుజన ఐకాస ఉపాధ్యక్షులు మామిడి సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతులు బాల కోటయ్య సబ్ ప్లాన్ చట్టం అమలుపై ప్రభుత్వ నాటకాలను, కుట్రలను ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ 2013 జనవరి 24వ తేదీన ఉమ్మడి ఏపీలో ఎస్సీ, ఎస్టీ కులాల సామాజిక స్వావలంబన, ఆర్థిక ఎదుగుదల కోసం తీసుకువచ్చిన చట్టాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.మూడేళ్ళలో ఎస్సీలకు చెందిన రూ.16 వేల కోట్లు, ఎస్టీలకు చెందిన రూ.4 వేల కోట్లు వెలశి రూ.20వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారన్నారు. నిధులను ఖర్చు చేయకపోగా, మంత్రి మేరుగు నాగర్జున సబ్ ప్లాన్ చట్టం కింద రూ.49,710 కోట్లు ఖర్చు చేసినట్లు మైసూరులో జరిగిన జాతీయ సదస్సులో తాటికాయంత అబద్ధాలు చెప్పి వచ్చారన్నారు. వృద్ధుల పింఛన్లు, వితంతువుల పెన్షన్లు, జగనన్న గోరు ముద్ద, పిల్లలకు పెట్టే కోడిగుడ్డు ఖర్చులను కూడా సబ్ ప్లాన్ పద్దు కింద చూపటం మోసంగా అభివర్ణించారు. దళిత కులాల ఒత్తిడికి తట్టుకోలేక కాలం ముగిస్తుందని తెలిసినా, చట్టం తీసుకు రాకుండా ఆర్డినెన్స్ తో కన్నీళ్లు తుడిచారన్నారు. దళిత బహుజన కులాలతో సమావేశాలు నిర్వహించి, చట్టంలోని లొసుగులను తొలగించి, కాల పరిమితి లేకుండా చట్టాన్ని పరిపూర్ణంగా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్ళించటం క్షమార్హం కాదన్నారు. అణగారిన కులాల ఆర్థిక తోడ్పాటు చట్టాన్ని నీరు కారిస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కుల సంఘాల ప్రతినిధులతో చర్చించి, ఎస్సీ ఎస్టీ నిధులను వారికే ఖర్చు చేయాలని కోరారు. నేషనల్ నవ క్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు మాట్లాడుతూ సబ్ ప్లాన్ చట్టం త్వరగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోటి పది లక్షల జనాభా గలిగిన ఎస్సీ ఎస్టీలకు ద్రోహం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతి దళిత జెఎసి కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ ఏపీలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కాగడా పెట్టి వెతికినా కానరాదని ఆరోపించారు.అబద్దాల ప్రభుత్వం అబద్ధాల పాలన చేస్తుందని దుయ్యబట్టారు. నవతరం పార్టీ జిల్లా అధ్యక్షులు యనమండ్ర కృష్ణ కిషోర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలను వారు విడుదల చేశారు.*

Comments (0)
Add Comment