పోరుకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ

హైదరాబాద్, ఫిబ్రవరి 4, (న్యూస్ పల్స్): కేంద్రంపై సాధన సమితుల పేరుతో మరో సమరానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ఏర్పాటు చేయగా మరికొన్నింటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలే లక్ష్యంగా పోరు చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే అన్ని రంగాలకు చెందిన ఉద్యోగ, కార్మికులతో జేఏసీలు ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. కేంద్రంపై లేఖల రూపంలో ఇప్పటికే సంధిస్తుండగా, క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే సాధన సమితులను ఏర్పాటు చేస్తోంది.రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన నిధులతో పాటు పలు అంశాలపై కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ పోరును సాగిస్తుంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై లేఖలతో నిలదీస్తుంది. మరో వైపు పార్టీ పరంగా ఆందోళనను మరింత ముమ్మరం చేయాలని భావిస్తోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ధర్నా చేపట్టగా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సాధనసమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అదే విధంగా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్‌ సహా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు కేంద్రానికి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. కేవలం లేఖలతో సరిపెట్టకుండా కేంద్రంపై క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష పోరును సాగించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది టీఆర్ఎస్ అధిష్టానం.సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ, నవోదయ విద్యా సంస్థలు, ఐఐఎం, ఐటీఐఆర్, రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం వంటి అనేక అంశాలతో పాటు అభివృద్ది ప్రాజెక్టులకు నిధుల మంజూరు వంటి అనేక అంశాల్లో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పు పడుతోంది. సీసీఐ ఆదిలాబాద్‌ యూనిట్‌ పునరుద్ధరణ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతోంది. మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.వరంగల్ ఉమ్మడి జిల్లా కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలతో కలిసి సాధన సమితిని ఏర్పాటు చేశారు.

జనవరి 31న వరంగల్ ఉమ్మడి జిల్లా కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే నిలయంను ముట్టడించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజిపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై సాధనసమితి పేరుతో ప్రత్యక్ష ఆందోళనకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు అయింది.సిమెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదిలాబాద్‌ యూనిట్‌ పునరుద్దరణకు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మరోవైపు సీసీఐ యూనిట్‌ పునద్ధరణకు చేపట్టాల్సిన ఆందోళనకు సంబంధించిన కార్యాచరణపై జనవరి 26న మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని ఆదిలాబాద్ కు చెందిన పార్టీ నేతలు, జిల్లా ప్రముఖులతో కేటీఆర్‌ చర్చించారు. ‘సీసీఐ సాధన సమితి’గా ఏర్పడి కేంద్రంపై ఉద్యమించేందుకు అవసరమైన కార్యాచరణ నిర్ణయించారు. ఇదిలా ఉంటే బయ్యారం స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలనే డిమాండుతో టీఆర్‌ఎస్‌ నేతలు జనవరి 28న మహబూబాబాద్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.రాబోయే రోజుల్లో వివిధ సంఘాలు, సంస్థలతో కలిసి ఆందోళన ముమ్మరం చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు త్వరలో వివిధ వర్గాలతో వరంగల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక జేఏసీ ఏర్పాటు చేసి హక్కుల సాధనకోసం ఉద్యమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో సమావేశాన్ని సైతం నిర్వహించారు.

కేంద్రం విధానాలపై నిరసనగా త్వరలో జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. వికలాంగుల హక్కుల సాధనకోసం జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖసైతం రాశారు.ఇదిలా ఉండగా బడ్జెట్ లో సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తామని స్పష్టం చేయడంతో బుధవారం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో, చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను ఖండించారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రం ప్రైవేటీకరణను ఉపసంహరించుకునే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, బీడీఎల్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఎల్, ఈసీఐల్, పోస్టల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్‌ తదితర రంగాలను కూడా కార్పోరేట్‌ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టీఆర్‌ఎస్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

ఎల్ఐసీ ని కాపాడుకునేందుకు అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బీమా ఉద్యోగులు మార్చి 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చారు. అందుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సన్నద్ధమవుతోందిపార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు , రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యక్ష పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఏయే అంశాలపై పోరాటం చేయాలని కార్యాచరణ రూపొందించింది. అదే విధంగా బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, గత ఏడేళ్లుగా తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమించనుంది. అదే విధంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు నిధుల రాబట్టడంలో వైఫల్యాలను ఎండగట్టనుంది. ఒకవైపు కేంద్రం, మరో వైపు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలపై ఇప్పటికే లేఖాస్త్రాలతో సంధిస్తుండగా మరో వైపు ప్రత్యక్ష ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది.

TRS party preparing for war on bjp
Comments (0)
Add Comment