అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ఉత్తరాంధ్ర మంత్రులు,ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశాలు ఇచ్చారేమో అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సందేహం వ్యక్తం చేశారు.మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి పాదయాత్ర ప్రవేశించకుండా ఉత్తరాంధ్ర ప్రజల ముసుగులో వైస్సార్సీపీ కార్యకర్తలతో అడ్డుకుంటారని సందేహం కలుగుతోంది అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కొనసాగుతున్న యాత్రను ఎలా అడ్డుకుంటారని రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ప్రకటనలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వైస్సార్సీపీ నేతలను పాదయాత్ర సమయంలో బైండోవర్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కి ఆదేశాలను ఇవ్వాలని హైకోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేయాలని అమరావతి జేఏసీ నేతలకు రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని అమరావతి విషయంలో ఎటువంటి వ్యతిరేకత లేదని కేవలం వైస్సార్సీపీ వారికే వ్యతిరేక భావం ఉందని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకే పాదయాత్ర అడ్డుకునే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు అన్నారు. వైస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించకపోవడం తప్పన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామని అబద్దాలు చెబుతున్నారని,నిజంగా మూడు రాజధానులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉంటే ప్రజలకు చూపించాలని నవతరంపార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం అవుతుంది అని భయం పట్టుకుంది అని అన్నారు. చిలకలూరిపేట నవతరంపార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేసారు.*