న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉక్రెయిన్ను మూడు భాగాలుగా విభజించి యుద్ధ క్రీడ ఆరంభించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇన్నాళ్లూ తాను పెంచి పోషించిన.. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. పుతిన్ యుద్ధనీతికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది.ఉక్రెయిన్ దేశం.. ఉక్రెయిన్తో పాటు.. కొత్తగా దొనెట్స్క్, లుహాన్స్క్ దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. వీటిని ‘రిపబ్లిక్ పీపుల్ ఆఫ్ ది స్టేట్స్’గా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని ప్రకటించింది. ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు పుతిన్. ఆ మేరకు డిక్లరేషన్పై సంతకం చేశారు.
‘‘ఉక్రెయిన్కు అసలు ఎప్పుడూ సొంత దేశం హోదా లేదు. దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం కూడా లేదు. ఉక్రెయిన్ సొంతగా అణ్వాయుధాలు తయారు చేయగలదు. దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉంది. అదే అసలైన ముప్పు’’ అని రష్యా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిని కోరుకుంటున్నాం.. కానీ ఉక్రెయిన్ భూభాగాన్ని వదులుకునేది లేదంటూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్ స్కీ తమ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ‘‘ఉక్రెయిన్ సౌర్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘిస్తోంది. శాంతి ఒప్పందాలను పట్టించుకోకుండా కయ్యానికి కాలుదువ్వుతోంది. కానీ ఇది మా దేశం. మేం ఎవరికీ భయపడేది లేదు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో వెనకడుగు వేసేది లేదు. మేం ఎవరికీ ఏమీ రుణపడి లేం.
అలాంటప్పుడు ఎవరికీ ఏం ఇవ్వబోం. మా భూభాగాన్ని కోల్పోవడానికి మేం ఏ మాత్రం సిద్ధంగా లేం’’ అని జెలెన్ స్కీ తేల్చి చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. తూర్పు ఉక్రెయిన్లో శాంతి పరిరక్షణ పేరిట రష్యా చేపట్టిన చర్యలు ‘అర్థం లేనివి’ అని అమెరికా మండిపడింది. యుద్ధం చేయాలన్న దురుద్దేశంతోనే రష్యా కొన్ని ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించిందని ఆరోపించింది. రష్యా చర్యలను బ్రిటన్ సహా పలు దేశాలు ఖండించాయి. జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా పుతిన్ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య తేల్చి చెప్పింది. రష్యా – ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్రిక్తతలు తగ్గించడం తక్షణ ప్రాధాన్యత అని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత రాయబారి తిరుమూర్తి తెలిపారు. ఇక, రష్యాపై నాటో కూటమి, ఐరోపా సమాఖ్య, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ నుంచి వేర్పడిన దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా వాసులు ఎటువంటి పెట్టుబడులు పెట్టరు. ఆ ప్రాంతానికి చెందిన సరుకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోనూ అమెరికా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు అడ్డుకోనున్నాయి.