వేములవాడ రాజన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్దే, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు.

స్వామివారి దర్శన అనంతరం పురోహితులు మహా మండపంలో గవర్నర్ తమిళసైని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసి ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. చారిత్రక, పురాతన ఆలయం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తునన్నారు. శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడం, స్వామి వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కాపాడుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని అన్నారు.ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.తెలంగాణలో అత్యంత ప్రధానమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలలో ఘనంగా జరుగుతున్నాయనీ, ఇందులో భాగంగా వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం మొదటి రోజే రాజభవన్ లో వేలాది మంది మహిళలతో బతుకమ్మ పండుగ జరుపుకున్నామనీ, రాష్ట్ర ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా
Comments (0)
Add Comment