సొంత సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ కేశినేని నాని

సొంత సోదరుడైన కేశినేని చిన్నిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని, అలా తిరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ వాహనం నంబరును టీఎస్07హెచ్07హెచ్ డబ్ల్యూ7777గా పేర్కొన్నారు. మే 27నే ఆయన ఫిర్యాదు చేయగా, జూన్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద విజయవాడ, పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలో, ఫిర్యాదులో పేర్కొన్న వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు తనిఖీ చేసి అన్నీ సవ్యంగానే ఉన్నట్టు గుర్తించి వదిలిపెట్టారు. ఈ వాహనం కేశినేని జానకిలక్ష్మి పేరుపై రిజిస్టరై ఉంది. దీనిని ఆమె భర్త అయిన కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆయన స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారు.

కాగా, టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా నాని రెండుసార్లు విజయం సాధించడంలో సోదరుడు చిన్ని పాత్ర కూడా ఎంతో ఉంది. ప్రచారంలో ఆయన సోదరుడికి అండగా ఉన్నారు. ఇటీవల ఆయన టీడీపీలో క్రియాశీలంగా ఉంటున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి ఆయన ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎదగాలనుకుంటున్నారని, వారి మధ్య విభేదాలకు ఇదే కారణమన్న చర్చ జరుగుతోంది.
Kesineni Nani, Kesineni Chinni, TDP Vijayawada, Police Case

Leave A Reply

Your email address will not be published.